బృందావన రావు గారి వ్రాత పత్రి


నీటి చుక్క కోసం…
ఆగస్ట్ 28, 2006, 10:59 సా.
Filed under: కధలు - కవితలు

ఆదిమ కాలంనాటి సరస్వతీ నది
అవని మీద నేడు కనిపించదు
అంతర్వాహిని అయిందనుకొని
ఆత్మవంచన చేసుకొంటున్నాం.

చెయ్యేరూ, గుండ్లకమ్మా, మూసీ లాంటి
చిన్న చిన్న వంకవాగులన్నీ
ఒకప్పుడిక్కడ ఏరుండేదని
ఒండ్రు దిబ్బలతో సాక్ష్యం చెపుతున్నాయి.

కృష్ణ కృశించి పోయింది.
గోదావరి గోష్పాదమవుతున్నది.
‘విదారించు ఎదన్, వట్టి ఎడారి తమ్ముడూ’ అని
కన్నీటి కైతలు రాయించుకుంది పెన్న.

ఆగామి కాలంలొ అంగిలి తదుపుకోవడానికి
నిజంగా దొరుకుతుందా నీటిచుక్క?

జలగీతాలు రాస్తున్నారు కవులు
జలయజ్ఞాలంటున్నారు ప్రభువులు
జలబిందువును కాపాడుకోవడం వినా
జనానికి వేరు దారి శూన్యం.

నిర్మల పేయజలంలేని – నిర్జల లోకం రాబోతోందా?
రాబోయే తరాలకోసం – జల సంరక్షణ అనివార్యం.
రేపటి వసంతం కోసం – నేడు విత్తనం నాటు
నేటి కోసం మాత్రమే బ్రతకడం – నేరస్థుల అలవాటు.

-సిహెచ్.వి. బృందావన రావు

ప్రచురణ : నడుస్తున్న చరిత్ర (జులై ’06)

ప్రకటనలు


సహచరి
ఆగస్ట్ 28, 2006, 10:00 సా.
Filed under: కధలు - కవితలు

ఆమె

ప్రకృతి తనకు ప్రసాదించిన మార్దవత్వాన్ని
గాత్రంలోనే కాక, మనసంతా నింపుకొని
నిన్ను ప్రేమగా లాలిస్తుంది.

నీ వేదనలను తనవిగా అనువదించుకొని
తన కవోష్ణశ్వాసల వీవనలతో
నీ ముఖాన్ని వీచి సేదదీర్చి
నిన్ను ఆపేక్షగా ఆశ్వాసిస్తుంది.

నీ కళ్ళోని మోహాన్నంతా
తన హ్రుదయంలోకి ఒంపుకొని
తన సాంద్ర ఆనందానురాగానికి
గర్భంలో రూపం ఏర్పరచి
వత్సరాంత బహుమతిగా
నీకు కానుక ఆందిస్తుంది.

కుటుంబ జీవన సమరానికి
తానే సేనానాయకి ఐనా
నీ రక్షణకు తానే కత్తీ, డాలూ అయి
నీ అంగరక్షకిగా తాను వెనకే ఒదిగుండి
దళవాయిగా చరిత్రలో
నిన్నేముందు నిలబెడుతుంది.

వాలంటీన్సు రోజనీ, మహిళాదినోత్సవమనీ
అప్పుడప్పుడూ ఆర్భాటం చేసే నిన్ను
మూడొందల అరవై ఐదు రోజులూ
తన మనసులో పొదుపుకొనే వుంటుంది.

భార్యంటే భరింపబడేదనీ, భర్తంటే భరించే వ్యక్తనీ
అర్ధం చెప్పిన నిఘంటువులు
సంసారంలో సర్వాన్నీ భరించే ఆమె విషయంలో మాత్రం
కావాలనే భర్తెవరో, అబద్ధమే చెప్పాయి.

నిజానికి అర్ధాంగి
మగవానికి పూర్ణాంగి.

– సి.హెచ్.వి. బృందావన రావు

ప్రచురణ: నడుస్తున్న చరిత్ర (మే ’06)తొలిపొద్దు తిరుగుబాటు
ఆగస్ట్ 23, 2006, 10:11 సా.
Filed under: కధలు - కవితలు

 Sun

తొలిపొద్దు తిరుగుబాటు 

వెలుగుతూ ఆరుతూ అల్పకాంతితో వున్నదని
హీనంగా చూడకు దాన్ని
అది ఇవ్వాళ మిణుగురే కావచ్చు
రేపు అదే అనంత కాంతి భాండంగా
విస్ఫోటించవచ్చు
శత సహస్ర కాంతి జ్వాలా శకలాలుగా
వియత్తును విద్యుదీకరించవచ్చు
దిక్కుల్ను వెలిగిస్తూ, చుక్కల్ని రగిలిస్తూ
కళ్ళు మిరుమిట్లు గొలిపే
వెలుతురు జలపాతంలా దూకవచ్చు
నల్లని చిన్ని విత్తనమే కదా అని
ఛీత్కారంతో చిదిమేయకు దాన్ని
గొయ్యితీసి పాతిపెట్టి
చిన్ని విత్తును ఛిన్నాభిన్నం చేశానని విర్రవీగకు
రేపదే మహావృక్షపు మందుపాతరై పేల్తుంది
నేలలోకి వేళ్ళానూ, ఆశాతీరాల్లోకి శాఖలనూ
విస్తరించి
నీ అల్పత్వానికి ఆకాశమెత్తు సాక్ష్యమవుతుంది

దూరాకాశంలో అరచెయంత కుడా లేని
నల్లని మరకను చూసి
అదేందిలే అని అలుసు ప్రదర్శించకు

ఒక చల్లని గాలిపెర సోకినా చాలు
నిత్య చలనశీలమైన అ మబ్బు తునక
వ్యాకోచించి
మహాభ్ర ఝంఝంగా మారి
భూమ్యాకాశాల అంతరాళాల్లో
జలప్రళయం సృష్టించవచ్చు
ఒళ్లంతా వేళ్ళుగా, కాళ్ళుగా, నోళ్ళుగా విజృంభించి
నీ దొంగ ప్రపంచాన్ని తుడిచిపెట్టవచ్చు

కడుపులు మాడుతుంటే ఖర్మ సిథ్దాంతాలు పనిచేయవు

ఆవగింజంత అశాంతి చాలు అక్షిగోళాలు
అరుణ కేతనాన్ని ఎగురవేయడానికి
అసంతృప్తి అగ్ని గుండాలను       
అధికార సముద్రాలు ఆర్పలేవు

వేకువంటే ఏమిటో తెలుసా నీకు
అది చీకటి పై తిరుగుబాటు.

-సి.హెచ్.వి. బృందవన రావు

ప్రచురణ: ప్రజాసాహితి (ఆగస్టు 05)ప్రపంచీక’రణం’
ఆగస్ట్ 22, 2006, 10:33 సా.
Filed under: కధలు - కవితలు

Anti Globalization

ఈ సమరానికి యుద్ధ ప్రకటనలేమీ వుండవు
అధ్యక్షుడో, ప్రధానమంత్రో
జాతిని ఉద్దేశిస్తూ చెసే
అభిభాషణలేవీ ఉండవు
ఆగ్నేయాస్త్రాలు, అణుబాంబులూ
కనిపించనే కనిపించవు
భట పటాలాన్ని పోగుచేసి
వీరోచిత ఉపన్యాసాలతో
జనాన్ని కదన వదనంలోకి తోసి
వీరాగ్రేసరులుగా చరిత్రకెక్కే
ప్రతివీర సేనానాయకులూ ఉండరు
తలలు పగిలి కాళ్ళూ చేతులు తెగి
క్షతగాత్రులైన సైనికులు, గజాశ్వాలూ
ఈ సంగ్రామ రంగంలో సాక్షాత్కరించరు
యుద్ధం, యుద్ధంలాగా జరుగదు
కండ్లక్కనిపించని సునామీలా
చాపకింద నీరులా
చప్పుడు లేకుండా వస్తుంది.
అలా అని సౌప్తిక పర్వమూ కాదు
కళ్ళు తెరిచి చూస్తుండగానే
ఒక్కక్కడూ ఒరిగి పోతుంటాడు
నీ శ్రమ ఫలితమూ నీది కాదు
నీ పంట ఫలమూ నీది కాదు
అంతా చట్టబద్ధంగా జరిగి
నువ్వు గప్ చిప్ గా ఓడింపబడి
కొల్లగొట్టబడతావు.
నీతో యుద్ధం చేసేవాడు
నీ కనుచూపు మేరలో కనిపించడు
యుద్ధం జరుగుతున్నదని తెలుసుకునేసరికి
నీవు పరాజితుడివై ఉంటావు.”వసుధైక కుటుంబక” మనేది
వక్రొక్తిగా మారిపోయి
అంధరాజు ఆర్ధిక ఆలింగనంలో
అఖిల ప్రపంచమూ ఏకీకరణం చెదుతుంది.
ఎప్పటికీ శవాలు అవడం వుండదు
మనుషులు శవాల్లా జీవిస్తూంటారు
          
           

ప్రచురణ: ప్రజాసాహితి (మార్చి 06)మిత్రులారా, విమర్శకుల్లారా….
ఆగస్ట్ 17, 2006, 11:53 ఉద.
Filed under: సామాన్య శాస్త్రం

మిత్రులారా, విమర్శకుల్లారా….ఇక్కడ మా నాన్న గారి కధలు, కవితలు, ఉత్తరాలు ప్రచురిద్దమని  అని అనుకొంటున్నాను.. అవి వివిధ పత్రికలలో, వివిధ పేర్లతో ప్రచురితం అయ్యాయి…ఆ పత్రిక అనుమతి లేకుండానే ఇక్కడ ప్రచురిస్తున్నాను., ఇది తప్పొ, ఒప్పొ నాకు తెలియదు., కానీ పత్రిక పేరు, సంచిక తేదిని ప్రచురిస్తాను…ఏమైనా తప్పు ఉంటే మన్నించండి, వివరాలు తెలియచేయండి.,సరిదిద్దుకొంటాను..మీ

అనీల్ చీమలమఱ్ఱి