బృందావన రావు గారి వ్రాత పత్రి


ఫలార్హత
సెప్టెంబర్ 30, 2006, 5:44 సా.
Filed under: కధలు - కవితలు

ఫలార్హత

విత్తనం నేలలో నాటగానే
బాధ్యత తీరిపోయినట్లుగాదు
బీజాన్ని పాతిపెట్టిన్నాటినుంచి
ఫలసాయానికి అర్రులు సాచడం
రాట్నానికి ఏకు ఎక్కించకుండా
గాల్లోంచి నూలు తీయబూనడం

గింజ నాటే ముందుగానే
భూమిని మొలకకు సిద్ధం చేయాలి
మొక్కకు అనువుగా పాదుచేయాలి
సారవంతమైన మట్టిని ప్రోదిచేయాలి
నీటితో నేలను పదును చేయాలి
భూసారాన్ని పెంచడానికి
అవసరమైతే ఎరువు వేయాలి..
శివుడికి అభిషేకం చేసినట్లు
గింజను జలసేచనంతో చల్లబరచాలి

తననుతాను రెండు చెక్కలుగా విస్ఫోటించుకొని
మొక్కగా రూపొండి, గింజ
తూర్పుకొండనుండి తొంగిచూచే
తొలిపొద్దుపొడుపులా
తలను పైకి నిక్కిస్తుంది..

ఆహ్వానించని అతిధిలా భావించి
పశువులు దాన్ని మట్టుపెట్టకుండా
కంచెకవచాన్ని తొడగాలి
రక్షణగా నిలవాలి.
మొక్క వృక్షమయ్యేంతవరకూ
మెలకువతో కాపాదాలి..

తనకు చేసే శుశ్రూషలకు
తృప్తిచెందిన చెట్టు
పెరిగి పెద్దదై కృతజ్ఞతతో
ఫలసాయాన్ని పంచి పెడుతుంది..

నిరంతరకృషి మాత్రమే
ఫలనుభవానికి
అర్హత చేకూరుస్తుంది

-సి హెచ్.వి. బృందావన రావు

ప్రచురణ – ధ్యానమాలిక (జూన్ ’06)

ప్రకటనలు


అవధాని
సెప్టెంబర్ 17, 2006, 8:22 ఉద.
Filed under: కధలు - కవితలు

అవధాని

ఎదలోని భావాల్ని ఎవరికీ చెప్పుకోవడం కుదరదు
మధురోహాల మధుమాసాన్ని మనసైన వారితో
ఆనందించడం వీలవదు
ఒక అడుగు ముందుకేస్తే – రెండో అడుక్కు నిషేధం
ఒక ముక్క మాట్లాడింతర్వాత – రెండోది మాట్లాడ్డానికి
అనుజ్ఞ వుండదు
అడుగడుక్కూ అడ్డంకి
నిమిష నిమిషానికీ నిషిద్ధాక్షరి!
ఇష్టమైన చోటికి పోయే వీలుండదు
చెయ్యాలనుకొన్న దాన్ని చేయడానికి వీలుండదు
ఇతరులేమిచేయమంటే అదే చేయ్యాలి
ఎక్కడికి వెళ్ళమంటె అక్క్డికే వెళ్ళి రావాలి
గుండెలుబికి వచ్చే కన్నిళ్ళు ఎన్ని బొట్లు రాలాలో
ముందే నిర్ధేశం
మామూలు సంభాషణల్లో ఎం మాట్లాడాలో కూడా ముందే
నిర్ణయం
పంజరంలోని చిలక పలికినట్లుగా
నోట్లోంచి వచ్చేవన్నీ ఇతరులిచ్చిన దత్తపదులే
ఇంట్లోంచి బయటకు వెడితే ఇకిలింపుల స్వాగతాలు
పనివున్నా లేకున్నా ఆషాఢభూతుల పలకరింపులు
సహచరుల సకిలింపులు – అధికార్ల చొంగకార్పు
అదిరింపులు
మర్యాద కోసం వినక తప్పదు
అడ్డమైన వాళ్ళ అప్రస్తుత ప్రసంగాలు
చదువ్విషయంలో రాజీ – ఉద్యోగ విషయంలో రాజీ
కట్నం విషయంలో రాజీ- కళ్యాణ విషయంలో రాజీ
తండ్రిక్కష్టం కలుగుతుందేమోనని రాజీ – తమ్ముడి
సంతోషంకోసం రాజీ
బ్రతుకంతా ప్రశ్నలే ప్రశ్నలు
అర్ధం లేనట్లు కనిపించే ఆఖరి పద్యపాదం అందంగా
అమరడానికి
సమాధానం సరైందో కాదో గానీ సవాలక్ష సమస్యాపూరణాలు
కన్ను తెరిచిందగ్గర్నించి మన్నులో కలసే దాకా
ఆడదాని జీవితం అహరహం అష్టావధానం!!

–సిహెచ్.వి. బృందావన రావు

ప్రచురణ : Akashicc (అక్టోబర్ ’05)      ప్రయోజనం
సెప్టెంబర్ 14, 2006, 12:57 ఉద.
Filed under: కధలు - కవితలు

ప్రయోజనం

దారికడ్డంగా వున్న రాయిని పక్కకు విసిరేసాను.

‘ఛీ’. పనికి మాలినది అంటూ.

‘మిత్రమా!’ నేనేమీ పనికిమాలినదాన్ని కాదు.
నాలాంటి కొన్ని రాళ్ళను పోగుజేసి గోడను నిర్మించొచ్చు.
మంచి పనివాడు నన్నో శిల్పంగా మలచవచ్చు.
ఆ శిల్పాన్నే ఆలయంలో దేవుడిగా ప్రతిష్టించవచ్చు”,
అంటూ చీవాట్లు పెట్టింది రాయి.

నేను చొక్కా మీద దుమ్ము దులుపుకొని,

“ఛీ! పనికిమాలిన దుమ్ము” అంటూ ముందుకు సాగబోయాను.

“సోదరా! నేనూ పనికిమాలిన దాన్ని కాదు.
నాలాంటి దుమ్మును మరికొంత పోగుచేసి ఎరువుగా వాడుకోవచ్చును.
నీటితో పదును చేసి, సారెకెక్కించి, నన్ను కుండగా రూపొందించవచ్చు.
ఆ కుండను చలివేంద్రలో వుంచి దాహార్తుల దప్పి తీర్చవచ్చు”. అంటూ
దుమ్ము దులిపి వదిలిపెట్టింది.

‘సరే బాగుంది’  అనుకొంటూ ముందుక్కదలబోతే
చెట్టు కొమ్మ మీంచి ఓ పండుటాకు ఠాప్పున తలపై రాలింది.
“ఇదో పనికిమాలినది” అని అనుకోబోతుండగానే

“ఏమయ్యోయ్! నేనస్సలు పనికి మాలినదాన్ని కాను.
నాలాంటి ఆకుల్ని దడిగా బిగించి తడికెగా వాడుకోవచ్చు.
నేలలో త్రొక్కి, నీటితో కుళ్ళ బెట్టి కంపోస్టు చేసి భూసారంగా ఉపయోగించుకోవచ్చు.
మీ ఈనాటి విజ్ఞానమంతా పూర్వం ఎండిన ఆకుల మీదనే భద్రపరిచారు తెలుసా.” అని
పాఠం ప్రారంభించింది పలిత పత్రం.

రాయీ, దుమ్మూ, ఆకూ కలసి నన్ను ప్రశ్నించాయి.

“అయ్యా…మనిషిగారూ!
మాలో లేని మస్తిష్కం మీకుందిగదా..
మేమందరం పనికి మాలిన వాళ్ళం – సరే
మీ వలన ఇతరులకేమైనా ప్రయోజనం కలుగుతున్నదా?”అంటూ.

పరులను వంచించి లాభం పొందడంలో అనుక్షణమూ బిజీగా ఉండే నాకు
పరుల కోసం వెచ్చించడానికి తీరిక ఏ మాత్రం లేదని ఎలా సమాధానం చెప్పడం?

సిహెచ్.వి. బృందావన రావు

ప్రచురణ: Akashicc(జూన్ ’06)మృచ్ఛకటికం
సెప్టెంబర్ 13, 2006, 4:07 ఉద.
Filed under: కధలు - కవితలు

మృచ్ఛకటికం

సందు మొదట్లో అతని బండి కన్పడగానే వీధి
వీధంతా ఒకసారి మేల్కొంటుందిశ్వేతాశ్వాలను పూన్చిన రధంలొ పార్ధసారధి
కూర్చున్నట్లు బండి ముందు సీటుపై కూర్చొని వచ్చే అతని
కోసం ప్రతి మధ్యాన్నం ఇల్లాండ్లు ఎదురుచూస్తుంటారు.

వంటింట్లోనూ, పెరట్లోనూ పని చేసుకుంటున్న
ఇల్లాండ్లకు పాంచజన్య శంఖ ధ్వనిలా వినిపిస్తుంది అతని
విజిల్ శబ్ధం.

కార్యసాధనే కాని మాటల మాటెత్తని ఖర్మయోగిలా
మౌనంగా ప్రతి ఇంటి ముందూ బండిని నిలిపి
విజిలూత్తాడతను.

ప్లాస్టిక్ సంచిల్లోనో, చెత్తబుట్టల్లోనో భద్రపరచిన పండ్ల తొక్కలనూ, కూరముక్కలనూ, కసుపునూ చిరునవ్వుతో             
శకటాసురిడికి నైవేద్యం చేస్తారు గృహిణులు.

ప్రతి ఇంటి కశ్మలాన్ని మోసుకుంటూ ముందుకు సాగిపోతాడతను.

బండి తనిల్లు దాటాక వచ్చిన అమ్మాయి ‘ ఇదిగో చెత్తబ్బాయ్’
అని వెనుక నుంచి పిలుస్తుంది.

‘చెత్తబ్బాయిని కాదమ్మా – చెత్తబండబ్బాయిని’ అని
జీవన వేదాంతాన్ని వివరించి ఇల్లాండ్లందర్నీ ముసిముసిగా
నవ్విస్తాడతను.

హీరోయిన్ కోసం త్యాగం చేసి లాంగ్‌షాట్‌లో
హొరైజన్లోకి వెళ్ళిపోతున్న పోతున్న హీరోలా అతనూ, అతని బండి
కనుమరుగైన తర్వాత
ఇంటినంతా తుడిచి, శుభ్రం చేసి స్నానం చేసినంత రిలీఫ్ గృహిణులకు.

(-కార్పొరేషన్ చెత్తబండి అబ్బాయికి- అడ్మిరేషన్‌తో)

సిహెచ్.వి.బృందావన రావు

ప్రచురణ : Akashicc (మే ’06)స్ర్తీవాదం
సెప్టెంబర్ 6, 2006, 11:55 ఉద.
Filed under: కధలు - కవితలు

స్ర్తీవాదం 

వివాహ రహిత సంబంధం
వివాహత్పూర్వ సంబంధం
వివాహేత సంబంధం
స్వలింగ సంబంధం
ఇంతేగదా స్ర్తీవాదమంటే-”
వెక్కిరించింది మగపురుగు.
“పైన చెప్పినవన్నీ
మగవాడి విషయములో తప్పుకానప్పుడు
స్త్రీ విషయంలో తప్పెలా ఔతుందని
నిగ్గదీయడంరా
స్త్రీవాదమంటే”-
ధిక్కరించింది చలిపిడుగు.

– సి. మనస్విని ( సిహెచ్.వి.బృందావన రావు)

ప్రచురణ : పత్రిక (జూన్ ’06)కాసిని నానీలు
సెప్టెంబర్ 1, 2006, 12:14 ఉద.
Filed under: కధలు - కవితలు

Gandhi

కాసిని నానీలు

ఇరవై నాలుగక్షరాల్లో
ఇనరశ్మిని దట్టించు
‘నానీ’ ఐ పేల్తుంది

ప్రియుడిపై తమకం / నఖక్షతాల్లో కనిపిస్తున్నది
గోరింట బాగా పండింది

కవిత్వం వాడికో ఆయుధం
దానితోనే వాడు / జనాల ప్రాణాలు తీస్తుంటాడు

బాలల ఉత్సవానికి / మంత్రి కోసం నిరీక్షణ
ఎండలో శోషిల్లి బాలలు

మొన్న ప్రేమగా చూసిన బాలుడు
నేడు ఈర్ష్యగా చూస్తున్నాడు
బాల్యం పోయింది

నింగిమగ్గం ఆసులో / కండె-సూరీడు
తూర్పూపడమరలకు తిరుగుతూ

గాంధీ అంటే వాడికి ఇష్టం
గాంధీ బొమ్మున్న నోట్ల కోసం
ఏమైనా చేస్తాడు.

– సి.హెచ్.వి. బృందావన రావు

ప్రచురణ : పత్రిక (మార్చి ’06)హేమంత శిశిరాలు
ఆగస్ట్ 29, 2006, 10:24 సా.
Filed under: కధలు - కవితలు

హేమంత శిశిరాలు

ఇది జ్ఞాపకాల హేమంతం
చలి కౌగిలిని వదిలించుకోలేని
నిస్తేజపు సూర్యుడిలా
గడిచిపోయిన వసంతాల జ్ఞాపకాల కౌగిలిని
వదిలించుకోలేని వృద్ధ హేమంతం!

బ్రతుకు ప్రయాణాన్ని ఒక్కో మజిలీ దాటుకొంటూ
పసితనపు అమాయక స్మృతులనూ
తొలియౌవనపు తొలకరి పులకరింతల గుర్తులనూ
జీవన సహచరి రాగరంజిత కౌగిలింతలనూ
కౌమార్య ఋతువుల్లో మెడకు పెనవేసుకున్న
ఆత్మజుల ఆత్మీయ హస్తాల తామర తూండ్లనూ
మధుమాసాల మనోహర సంగీతాలనూ
శ్రావణ మేఘాల జల్లుల వనావల్లప్పల కేరింతలనూ
అర్ధాంగి తనూ కలసి రాల్చుకొని,
పరస్పరం తుడుచుకొన్న
గ్రీష్మాతాపాల కన్నీళ్ళూ
సింహావలోకనంగా సమీక్షించుకొంటూ
జ్ఞాపకాల బుట్టను నెమ్మదిగా దించుకొంటూ-
నిశ్చలమైపోయిన ప్రశాంత హేమంతం!

ఒక్కో మధురస్మృతి ఒక్కో పండుటాకులా రాలుతూ
అన్ని ఆకులూ రాలాక మోడువారిన చెట్టైన
ఈకాంత శిశిరం కోసం ఇక ఎదురుచూపు!
బ్రతుకు పుస్తకంలో ఆఖరి అధ్యాయం!
చివరి పేజీ తిప్పగానే, ఓ సంపూర్ణ జీవన ఏకాంకికకు
భరతవాక్యపు యువనిక!

-సిహెచ్.వి.బృందావన రావు

ప్రచురణ: నడుస్తున్న చరిత్ర (జనవరి ’06)