ప్రచురించిన వర్గము కధలు - కవితలు
మృచ్ఛకటికం
సందు మొదట్లో అతని బండి కన్పడగానే వీధి
వీధంతా ఒకసారి మేల్కొంటుందిశ్వేతాశ్వాలను పూన్చిన రధంలొ పార్ధసారధి
కూర్చున్నట్లు బండి ముందు సీటుపై కూర్చొని వచ్చే అతని
కోసం ప్రతి మధ్యాన్నం ఇల్లాండ్లు ఎదురుచూస్తుంటారు.
వంటింట్లోనూ, పెరట్లోనూ పని చేసుకుంటున్న
ఇల్లాండ్లకు పాంచజన్య శంఖ ధ్వనిలా వినిపిస్తుంది అతని
విజిల్ శబ్ధం.
కార్యసాధనే కాని మాటల మాటెత్తని ఖర్మయోగిలా
మౌనంగా ప్రతి ఇంటి ముందూ బండిని నిలిపి
విజిలూత్తాడతను.
ప్లాస్టిక్ సంచిల్లోనో, చెత్తబుట్టల్లోనో భద్రపరచిన పండ్ల తొక్కలనూ, కూరముక్కలనూ, కసుపునూ చిరునవ్వుతో
శకటాసురిడికి నైవేద్యం చేస్తారు గృహిణులు.
ప్రతి ఇంటి కశ్మలాన్ని మోసుకుంటూ ముందుకు సాగిపోతాడతను.
బండి తనిల్లు దాటాక వచ్చిన అమ్మాయి ‘ ఇదిగో చెత్తబ్బాయ్’
అని వెనుక నుంచి పిలుస్తుంది.
‘చెత్తబ్బాయిని కాదమ్మా – చెత్తబండబ్బాయిని’ అని
జీవన వేదాంతాన్ని వివరించి ఇల్లాండ్లందర్నీ ముసిముసిగా
నవ్విస్తాడతను.
హీరోయిన్ కోసం త్యాగం చేసి లాంగ్‌షాట్‌లో
హొరైజన్లోకి వెళ్ళిపోతున్న పోతున్న హీరోలా అతనూ, అతని బండి
కనుమరుగైన తర్వాత
ఇంటినంతా తుడిచి, శుభ్రం చేసి స్నానం చేసినంత రిలీఫ్ గృహిణులకు.
(-కార్పొరేషన్ చెత్తబండి అబ్బాయికి- అడ్మిరేషన్‌తో)
సిహెచ్.వి.బృందావన రావు
ప్రచురణ : Akashicc (మే ‘06)