ప్రచురించిన వర్గము కధలు - కవితలు

తొలిపొద్దు తిరుగుబాటు
వెలుగుతూ ఆరుతూ అల్పకాంతితో వున్నదని
హీనంగా చూడకు దాన్ని
అది ఇవ్వాళ మిణుగురే కావచ్చు
రేపు అదే అనంత కాంతి భాండంగా
విస్ఫోటించవచ్చుశత సహస్ర కాంతి జ్వాలా శకలాలుగా
వియత్తును విద్యుదీకరించవచ్చు
దిక్కుల్ను వెలిగిస్తూ, చుక్కల్ని రగిలిస్తూ
కళ్ళు మిరుమిట్లు గొలిపే
వెలుతురు జలపాతంలా దూకవచ్చునల్లని చిన్ని విత్తనమే కదా అని
ఛీత్కారంతో చిదిమేయకు దాన్ని
గొయ్యితీసి పాతిపెట్టి
చిన్ని విత్తును ఛిన్నాభిన్నం చేశానని విర్రవీగకురేపదే మహావృక్షపు మందుపాతరై పేల్తుంది
నేలలోకి వేళ్ళానూ, ఆశాతీరాల్లోకి శాఖలనూ
విస్తరించి
నీ అల్పత్వానికి ఆకాశమెత్తు సాక్ష్యమవుతుంది
దూరాకాశంలో అరచెయంత కుడా లేని
నల్లని మరకను చూసి
అదేందిలే అని అలుసు ప్రదర్శించకు
ఒక చల్లని గాలిపెర సోకినా చాలు
నిత్య చలనశీలమైన అ మబ్బు తునక
వ్యాకోచించి
మహాభ్ర ఝంఝంగా మారి
భూమ్యాకాశాల అంతరాళాల్లో
జలప్రళయం సృష్టించవచ్చు
ఒళ్లంతా వేళ్ళుగా, కాళ్ళుగా, నోళ్ళుగా విజృంభించి
నీ దొంగ ప్రపంచాన్ని తుడిచిపెట్టవచ్చు
కడుపులు మాడుతుంటే ఖర్మ సిథ్దాంతాలు పనిచేయవు
ఆవగింజంత అశాంతి చాలు అక్షిగోళాలు
అరుణ కేతనాన్ని ఎగురవేయడానికి
అసంతృప్తి అగ్ని గుండాలను
అధికార సముద్రాలు ఆర్పలేవు
వేకువంటే ఏమిటో తెలుసా నీకు
అది చీకటి పై తిరుగుబాటు.
-సి.హెచ్.వి. బృందవన రావు
ప్రచురణ: ప్రజాసాహితి (ఆగస్టు 05)