బృందావన రావు గారి వ్రాత పత్రి


ప్రపంచీక’రణం’
ఆగష్టు 22, 2006, 10:33 అపరాహ్నం
ప్రచురించిన వర్గము కధలు - కవితలు

Anti Globalization

ఈ సమరానికి యుద్ధ ప్రకటనలేమీ వుండవు
అధ్యక్షుడో, ప్రధానమంత్రో
జాతిని ఉద్దేశిస్తూ చెసే
అభిభాషణలేవీ ఉండవు
ఆగ్నేయాస్త్రాలు, అణుబాంబులూ
కనిపించనే కనిపించవు
భట పటాలాన్ని పోగుచేసి
వీరోచిత ఉపన్యాసాలతో
జనాన్ని కదన వదనంలోకి తోసి
వీరాగ్రేసరులుగా చరిత్రకెక్కే
ప్రతివీర సేనానాయకులూ ఉండరు
తలలు పగిలి కాళ్ళూ చేతులు తెగి
క్షతగాత్రులైన సైనికులు, గజాశ్వాలూ
ఈ సంగ్రామ రంగంలో సాక్షాత్కరించరు
యుద్ధం, యుద్ధంలాగా జరుగదు
కండ్లక్కనిపించని సునామీలా
చాపకింద నీరులా
చప్పుడు లేకుండా వస్తుంది.
అలా అని సౌప్తిక పర్వమూ కాదు
కళ్ళు తెరిచి చూస్తుండగానే
ఒక్కక్కడూ ఒరిగి పోతుంటాడు
నీ శ్రమ ఫలితమూ నీది కాదు
నీ పంట ఫలమూ నీది కాదు
అంతా చట్టబద్ధంగా జరిగి
నువ్వు గప్ చిప్ గా ఓడింపబడి
కొల్లగొట్టబడతావు.
నీతో యుద్ధం చేసేవాడు
నీ కనుచూపు మేరలో కనిపించడు
యుద్ధం జరుగుతున్నదని తెలుసుకునేసరికి
నీవు పరాజితుడివై ఉంటావు.”వసుధైక కుటుంబక” మనేది
వక్రొక్తిగా మారిపోయి
అంధరాజు ఆర్ధిక ఆలింగనంలో
అఖిల ప్రపంచమూ ఏకీకరణం చెదుతుంది.
ఎప్పటికీ శవాలు అవడం వుండదు
మనుషులు శవాల్లా జీవిస్తూంటారు
          
           

ప్రచురణ: ప్రజాసాహితి (మార్చి 06)